
న్యూస్ డెస్క్: దక్షిణాఫ్రికా అధ్యక్షత వహించిన జీ20 సదస్సు ముగిసింది. ఈ సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు సిరిల్ రమఫోసో చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయించాయి. జీ20 నిర్వహణ ఎంత కష్టమో వివరిస్తూ, తమకు భారత్ ఎంత అండగా నిలిచిందన్న విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు.
రమఫోసో మాట్లాడుతూ.. “జీ20 నిర్వహణ ఇంత కష్టంగా ఉంటుందని భారత్ ముందే చెప్పి ఉంటే, మేము బహుశా పారిపోయేవాళ్లం” అని చమత్కరించారు. సదస్సు నిర్వహణలో భారత్ నుంచి తాము చాలా నేర్చుకున్నామని, భారత్ ఇచ్చిన మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వేదిక చాలా చిన్నది అని రమఫోసో అనగా, ప్రధాని మోడీ స్పందిస్తూ “ఇలాంటి వేదికలే ఎల్లప్పుడూ అందంగా ఉంటాయి” అని పేర్కొన్నారు. 2023లో భారత్ ఢిల్లీలోని భారత్ మండపంలో ఈ సదస్సును విజయవంతంగా నిర్వహించడం తెలిసిందే.
ఈ సదస్సు ముగింపు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రతిపాదనలు తెర మీదకు తెచ్చారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలితో సహా అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన బలంగా నొక్కి చెప్పారు.
భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా కూటమి (ఇబ్సా) తరపున ‘డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్’ ఏర్పాటు చేయాలని మోడీ ప్రతిపాదించారు. యూపీఐ, కోవిన్ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను పంచుకోవడం ఈ కూటమి లక్ష్యం.
ఇబ్సా కూటమి అంతర్జాతీయ సంస్థల్లో మార్పుల ఆవశ్యకతను గుర్తు చేస్తుందని మోడీ అన్నారు. నేటి ప్రపంచంలో కనిపిస్తున్న విభజనలను పక్కన పెట్టి, ఐక్యతతో ముందుకు సాగాలనే సందేశాన్ని ఇబ్సా ఇస్తోందని మోడీ మాటలు కీలకంగా మారాయి.
