
ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజైన ఆగస్ట్ 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో జరిగిన “స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర” సభలో ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.
ఈ పథకం మహిళలకు ఆర్థిక స్వావలంబన, భద్రతను పెంచుతుందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. “మహిళల సాధికారతే మా లక్ష్యం. మేము ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నాం” అని ఆయన స్పష్టం చేశారు. ఈ పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు.
ప్రజా సంక్షేమం తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని చంద్రబాబు తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధరలు, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు. పింఛన్లు, దీపం-2, తల్లికి వందనం వంటి పథకాలతో అన్ని వర్గాలకు మద్దతుగా నిలుస్తున్నామని వివరించారు.
రైతు బజార్ల వ్యవస్థను బలోపేతం చేయనున్నట్టు తెలిపారు. కర్నూలు జిల్లా రైతు బజార్‌ను ఆధునీకరించేందుకు రూ.6 కోట్లు కేటాయించారు. ఇంటింటికి తాగునీరు, మంచి రోడ్లతో పాణ్యం అభివృద్ధి చెందుతుందని అన్నారు.