Sunday, July 19, 2026
HomeInternationalదోమలు లేని దేశంలో కలకలం.. ఐస్‌లాండ్‌లో తొలిసారిగా..

దోమలు లేని దేశంలో కలకలం.. ఐస్‌లాండ్‌లో తొలిసారిగా..

first-time-mosquitoes-found-in-iceland-causes-panic

న్యూస్ డెస్క్: ప్రపంచంలో దోమలు లేని ఏకైక దేశం ఏదైనా ఉందంటే అది ఐస్‌లాండ్. ఈ ఖ్యాతితో దశాబ్దాలుగా ప్రత్యేకంగా నిలిచిన ఆ దేశానికి ఇప్పుడు కొత్త ముప్పు పొంచి వచ్చింది. శాస్త్రవేత్తలు తాజాగా ఆ దేశంలో మొదటిసారిగా దోమలను కనుగొనడంతో ఈ అరుదైన రికార్డుకు తెరపడినట్లేనని ఆందోళన చెందుతున్నారు.

రాజధాని రేక్జావిక్‌కు సమీపంలోని పశ్చిమ ఐస్‌లాండ్‌లో గల కిడాఫెల్ ప్రాంతంలో బ్జోర్న్ హ్జాల్టాసన్ అనే వ్యక్తికి ఈ వింత కీటకాలు కనిపించాయి. అనుమానంతో వాటిని పట్టుకున్న ఆయన, వెంటనే శాస్త్రవేత్తలకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న నేచురల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ కీటక శాస్త్రవేత్త మాథియాస్ ఆల్ఫ్రెడ్సన్ రంగంలోకి దిగారు. ఆయన పరిశీలనలో మొత్తం మూడు దోమలు (రెండు ఆడ, ఒకటి మగ) పట్టుబడ్డాయి. వాటిని ‘కులిసెటా అనూలాటా’ జాతికి చెందినవిగా గుర్తించారు.

నిజానికి, చాలా ఏళ్ల క్రితం కెఫ్లావిక్ విమానాశ్రయంలోని ఓ విమానంలో వేరే జాతికి చెందిన ఒకే ఒక్క దోమ కనిపించింది. కానీ, స్థానికంగా దోమలు నివసిస్తూ, వృద్ధి చెందడం మాత్రం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

ఈ పరిణామంపై పరిశోధకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ మార్పుల కారణంగా ఐస్‌లాండ్‌లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలే దీనికి కారణమని భావిస్తున్నారు. వెచ్చని వాతావరణం దోమలు జీవించడానికి, వృద్ధి చెందడానికి అనుకూలంగా మారుతోందని వారు హెచ్చరిస్తున్నారు.

సాధారణంగా ఐస్‌లాండ్‌లోని నీటిలో ఉండే రసాయనాలు, తీవ్రమైన చలికాలం దోమల లార్వా పెరగడానికి ఏమాత్రం అనుకూలించవు. కానీ, మారుతున్న పరిస్థితులు, వేడెక్కుతున్న వాతావరణం ఈ సహజ రక్షణ కవచాన్ని దెబ్బతీస్తున్నాయని, ఇది భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular