
న్యూస్ డెస్క్: కరూర్‌లో జరిగిన విజయ్ టీవీకే ర్యాలీలో తొక్కిసలాట ఘటన ఇంకా పెద్ద చర్చకే దారితీస్తోంది. ఈ ప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోవడం, పలువురు అభిమానులు తీవ్రంగా గాయపడటం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, పలువురిని అరెస్టు చేశారు.
ఎఫ్ఐఆర్ ప్రకారం, టీవీకే పార్టీ నేతలు బుస్సీ ఆనంద్, నిర్మల్ కుమార్ వంటి కీలక నేతల పేర్లు ఉన్నాయి. కానీ విజయ్ పేరు మాత్రం నమోదు కాలేదు. సభలో బలం ప్రదర్శించేందుకే ఉద్దేశపూర్వకంగా ఆయన ఆలస్యంగా వచ్చారని, దీనివల్లే అభిమానులు అలసిపోయి, పరిస్థితి అదుపు తప్పిందని పోలీసులు పేర్కొన్నారు.
ఉదయం నుంచే అభిమానులు సభా స్థలికి చేరుకున్నారు. కానీ విజయ్ మాత్రం రాత్రి ఆలస్యంగా వేదికకు చేరుకోవడంతో అభిమానులు విపరీతంగా ఒత్తిడికి గురయ్యారు. ఇదే తొక్కిసలాటకు కారణమైందని ఎఫ్ఐఆర్‌లో ఉన్న వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.
అంతేకాకుండా అభిమానులకు నీరు, ఆహారం వంటి సౌకర్యాలు కల్పించకపోవడాన్ని కూడా పోలీసులు ప్రధాన కారణంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నిర్వాహకుల నిర్లక్ష్యం స్పష్టమవుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అయితే విజయ్ అభిమానులు మాత్రం ఈ ఆరోపణలను తిరస్కరిస్తున్నారు. మార్గమధ్యంలో అభిమానుల స్వాగతాల వల్లే ఆలస్యం జరిగిందని, ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేయలేదని వాదిస్తున్నారు.
మొత్తానికి ఈ ఘటన విజయ్ రాజకీయ ప్రస్థానానికి పెద్ద పరీక్షగా మారింది. అభిమానుల ప్రాణాలు పోయిన ఘటనపై ఆయన ఏ విధంగా స్పందిస్తారో అన్నది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
