
న్యూస్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కారు పేలుడు కేసు దర్యాప్తులో కీలక పురోగతి లభించింది. ఎర్రకోట సమీపంలో పేలుడుకు కారణమైన హ్యుందాయ్ ఐ20 కారు యజమానిని పోలీసులు గుర్తించారు.
వాహన రిజిస్ట్రేషన్ ఆధారంగా, కారు పాత యజమాని అయిన హర్యానాకు చెందిన నదీమ్ ఖాన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంతకుముందు, ఈ కారును నదీమ్‌కు విక్రయించిన అసలు యజమాని, గుర్గావ్‌కు చెందిన మహ్మద్ సల్మాన్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది, 20 మందికి పైగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు జరిగిన సమయంలో కారులో ముగ్గురు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
అయితే, ఈ పేలుడులో గాయపడిన వారి శరీరాల్లో ఎలాంటి పెల్లెట్లు (లోహపు ముక్కలు) లభించకపోవడం దర్యాప్తు అధికారులను ఆశ్చర్యపరుస్తోంది. ఇది సాధారణ బాంబు పేలుళ్లకు భిన్నంగా ఉందని వారు పేర్కొంటున్నారు.
ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి, నిందితులను త్వరగా పట్టుకోవాలని జాతీయ దర్యాప్తు సంస్థలను ఆదేశించారు.
