న్యూస్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ సోమవారం సాయంత్రం భారీ పేలుడుతో దద్దరిల్లింది. ఎర్రకోట సమీపంలోని రద్దీగా ఉండే చాందినీ చౌక్ మెట్రో స్టేషన్ వద్ద ఓ కారులో శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న వెంటనే 20 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. పేలుడు ధాటికి సమీపంలోని మరో మూడు, నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయి. క్షతగాత్రులను లోక్‌నాయక్ ఆసుపత్రికి తరలించారు. భారీ అగ్నిగోళం ఎగిసిపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన దర్యాప్తు సంస్థలు, ఇది ఉగ్రవాద చర్యేనా అనే కోణంలో విచారణ ప్రారంభించాయి. యాంటీ-టెర్రర్ స్క్వాడ్ (ATS), ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ బృందాలు ఘటనా స్థలాన్ని ఆధీనంలోకి తీసుకుని ఆధారాలు సేకరిస్తున్నాయి.
ఢిల్లీ పేలుడు నేపథ్యంలో కేంద్ర హోంశాఖ దేశంలోని పలు నగరాలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా, మహారాష్ట్ర రాజధాని ముంబైతో పాటు, ఉత్తర ప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. సున్నితమైన ప్రాంతాల్లో గస్తీని, తనిఖీలను పెంచాలని ఆదేశాలు జారీ చేశారు.
