న్యూస్ డెస్క్: ప్రపంచ బిలియనీర్ల జాబితాలో చేరిన మొట్టమొదటి ఫుట్‌బాల్ ఆటగాడిగా క్రిస్టియానో రొనాల్డో చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో సాధారణంగా వ్యాపారవేత్తలు, టెక్ దిగ్గజాలే ఉంటారు. కానీ, అసాధారణమైన కృషి, పట్టుదలతో రొనాల్డో ఈ మైలురాయిని చేరుకున్నారు. ఆయన మొత్తం సంపద దాదాపు 1.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 12,352 కోట్లు) ఉంటుందని అంచనా.
రొనాల్డో ఆర్థిక విజయానికి అసలైన బలం ఆయన ఆట కాదు, ఆయన సృష్టించుకున్న గ్లోబల్ బ్రాండ్ విలువ. పేరు ఒక బ్రాండ్‌గా మారడంతో, ప్రపంచంలోని నైక్, ఆర్మానీ, కాస్ట్రోల్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఆయనతో ఒప్పందాలు చేసుకోవడానికి క్యూ కట్టాయి. ఈ బ్రాండ్ డీల్స్ ద్వారానే ఆయన రూ. 1,554 కోట్ల వరకు సంపాదించారు.
కెరీర్‌ను 2002లో మొదలుపెట్టి, 2023 వరకు కేవలం మ్యాచ్‌లు ఆడటం ద్వారానే 550 మిలియన్ డాలర్లు సంపాదించారు. రొనాల్డో సంపాదనకు మరింత బలం చేకూర్చిన డీల్.. సౌదీ క్లబ్ అల్-నస్రాతో కుదుర్చుకున్న ఒప్పందమే. మొదట 200 మిలియన్ డాలర్లుగా ఉన్న ఈ ఒప్పందం, తర్వాత 400 మిలియన్ డాలర్లకు పెరిగింది.
ఈ భారీ ఒప్పందం కేవలం రొనాల్డోకు డబ్బు ఇవ్వడమే కాకుండా, సౌదీ అరేబియా ఫుట్‌బాల్ మార్కెట్‌కు ప్రపంచ స్థాయిలో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. సౌదీ క్రీడా రంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్న సమయంలో రొనాల్డో రాక చాలా కీలకమైంది.
రొనాల్డో విజయం కేవలం టాలెంట్‌కు సంబంధించినది కాదు. ఇది సోషల్ మీడియా ప్రభావం, ప్లాన్డ్ పర్సనల్ బ్రాండింగ్ విజయంగా చూడాలి. ఒక క్రీడాకారుడు కూడా బిలియన్ డాలర్ల స్థాయిని చేరగలడని ఆయన నిరూపించాడు.
రొనాల్డో సాధించిన ఈ చారిత్రక ఘట్టం యువ క్రీడాకారులకు గొప్ప ప్రేరణగా నిలుస్తుంది. ఆటలో ప్రతిభతో పాటు, మార్కెట్‌పై అవగాహన, ఆర్థిక దృక్పథం, క్రమశిక్షణ కూడా ఎంత ముఖ్యమో ఆయన చేసి చూపించారు.
