
న్యూస్ డెస్క్: ప్రపంచానికి పెనుముప్పుగా మారిన చైనా రుణ విధానంపై తాజా నివేదిక షాకింగ్ అంశాలను వెల్లడించింది. ప్రపంచంలోని 80కి పైగా దేశాలు డ్రాగన్ ‘రుణవలయం’లో చిక్కుకున్నట్లు తేలింది. అమెరికాతో సహా సంపన్న యూరోపియన్ దేశాల కంపెనీలకు కూడా చైనా బ్యాంకులు భారీ స్థాయిలో అప్పులు ఇచ్చాయి.
అమెరికాలోని విలియం అండ్ మేరీ కాలేజీకి చెందిన ఎయిడ్ డేటా (AidData) విడుదల చేసిన ఈ నివేదిక, ప్రపంచంలోని దాదాపు 80 శాతం దేశాల్లోని కంపెనీలపై చైనా ఎలా పట్టు సాధిస్తుందో స్పష్టం చేసింది. 2000 నుంచి 2023 వరకు చైనా ఇచ్చిన రుణాల వివరాలను నివేదిక అందించింది.
చైనా నుంచి భారీ స్థాయిలో అప్పులు తీసుకున్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉండటం గమనార్హం. ఆ తర్వాత రష్యా, ఆస్ట్రేలియా, వెనిజువెలా, పాకిస్థాన్ వంటి దేశాలు ఉన్నాయి.
చైనా మొదట్లో పేద దేశాలకు ఎక్కువగా రుణాల్ని ఇచ్చేది. 2000 సంవత్సరం తర్వాత సంపన్న దేశాలకు వేగంగా డెవలప్ అవుతున్న దేశాలకు రుణాల్ని పెంచుతూ తన వ్యూహాన్ని మార్చుకుంది. ఇప్పుడు 75 శాతానికి పైగా రుణాలన్నీ పెద్ద దేశాలకే ఇస్తోంది.
అమెరికాలోని 2,500 సంస్థలకు ప్రాజెక్టులకు చైనా రూ. 18.1 లక్షల కోట్ల రుణాల్ని ఇచ్చింది. 27 యూరోపియన్ దేశాలకు చెందిన 1,800 కంపెనీలకు రూ. 14.4 లక్షల కోట్లు అప్పులు ఇచ్చింది. ఈ రుణాల్లో 95 శాతానికి పైగా చైనా ప్రభుత్వ బ్యాంకులు ఆర్థిక సంస్థలు ఇచ్చినవే.
ఈ రుణాలు మౌలిక వసతులు, సెమీ కండక్టర్ తయారీ, అరుదైన ఖనిజాలకు సంబంధించిన కంపెనీలకే అందుతున్నాయి. ఆయా కంపెనీల్లో వాటాలు పెంచుకోవడం వాటిని సొంతం చేసుకోవడం ద్వారా చైనా ప్రపంచంలోని కీలక రంగాలపై పట్టు సాధిస్తున్న వైనం నివేదికలో వెల్లడైంది.
