
న్యూస్ డెస్క్: 2008లో జరిగిన 26/11 ముంబై టెర్రరిస్ట్ దాడులు భారతదేశ చరిత్రలో అత్యంత భయానక ఘటనలుగా నిలిచాయి. ఆ దాడులు కేవలం దేశానికే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ కలకలం రేపాయి. ప్రాణనష్టం, ఆర్థిక నష్టం దేశాన్ని కుదిపేశాయి.
ఈ ఘటనపై అప్పటి హోంమంత్రి పి. చిదంబరం తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దాడుల తరువాత భారత్ యుద్ధం చేసేందుకు సిద్ధమైందని, కానీ ఆ దశలో అంతర్జాతీయ ఒత్తిళ్ల కారణంగా వెనక్కు తగ్గినట్లు వెల్లడించారు.
ప్రత్యేకంగా అమెరికా అప్పటి విదేశాంగ కార్యదర్శి కండోలిజా రైజ్ భారత్‌ను అడ్డుకున్నారని, యుద్ధం కాకుండా శాంతియుత పరిష్కారం కోసం ఒత్తిడి తెచ్చిందని ఆయన అన్నారు.
ఈ కామెంట్లు బయటకు రావడంతో రాజకీయ వర్గాల్లో వేడి చర్చ మొదలైంది. కాంగ్రెస్ నేత చేసిన ఈ వ్యాఖ్యలను బీజేపీ తమకనుకూలంగా వాడుకుంటూ కాంగ్రెస్ దేశ భద్రతను తేలికగా తీసుకుందంటూ విమర్శిస్తోంది.
భద్రతా నిపుణులు మాత్రం ఈ వ్యాఖ్యలు వ్యూహాత్మక సమస్యలను బయటపెడుతున్నాయని, భవిష్యత్తులో ఇలాంటి దాడులపై కఠిన నిర్ణయాలు అవసరమని సూచిస్తున్నారు.
మొత్తానికి చిదంబరం వ్యాఖ్యలు మళ్లీ 26/11 దాడుల జ్ఞాపకాలను తెరపైకి తీసుకువచ్చాయి. అప్పటి నిర్ణయాలు రాజకీయ, అంతర్జాతీయ ఒత్తిళ్ల ఫలితమేనని స్పష్టమైంది.
