
న్యూస్ డెస్క్: ఇటీవల ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీలో చేరటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఉండవల్లిలో చంద్రబాబు సమక్షంలో మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి పసుపు కండువా కప్పుకున్నారు.
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ ఈ చేరికలు జరగడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. చంద్రబాబు వీరి సేవలను తగిన రీతిలో వినియోగిస్తామని హామీ ఇచ్చారు. అయితే, మండలి ఛైర్మన్ రాజీనామాలను ఆమోదించకపోవడం వల్ల ఇది చట్టపరమైన వివాదంగా మిగిలింది.
గతంలోనూ అధికారంలో ఉన్నప్పుడు విపక్ష ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున చేర్చుకున్న చంద్రబాబు తర్వాతి ఎన్నికల్లో నష్టపోయారు. ఇప్పుడు మళ్లీ అదే వ్యూహాన్ని అనుసరించడం పై విమర్శలు వస్తున్నాయి.
వీరి చేరిక వల్ల టీడీపీ బలం పెరిగినా, మండలిలో గణనీయమైన మార్పులు జరగవు. ఎందుకంటే ఎన్నికలు జరిగితే కూటమి అభ్యర్థులే గెలిచే అవకాశం ఎక్కువ. కాబట్టి ఈ చేరికలు పెద్దగా ప్రభావం చూపవని విశ్లేషకులు చెబుతున్నారు.
వైసీపీ ఎమ్మెల్సీలను చేర్చుకోవడం ద్వారా రాజకీయంగా ఇమేజ్ నష్టపోవచ్చని కొందరు టీడీపీ అనుచరులే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ తరహా చేరికలు పార్టీకి లాభం కంటే నష్టం కలిగించే అవకాశమే ఎక్కువ అని చెబుతున్నారు.
మొత్తానికి చంద్రబాబు మళ్లీ అదే తప్పు చేస్తున్నారా అన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీస్తోంది. పరిస్థితులు చూస్తే ఈ వ్యూహం పార్టీ భవిష్యత్తుకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.
