
విజయవాడ: ఇటీవల జరిగిన టెక్ AI 2.0 సమ్మిట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల ఆహార నిల్వలు, ఆరోగ్యంపై దాని ప్రభావాన్ని వివరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్ పాలనలో బియ్యం అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రజల జీవనశైలి ఎలా మారిందో ఆయన గుర్తుచేశారు.
“ఎన్టీఆర్ రెండు రూపాయలకే బియ్యం పథకం ప్రవేశపెట్టిన తర్వాతే అందరికీ అన్నం తినే అవకాశం లభించింది,” అని తెలిపారు. అయితే, ఇప్పుడు బియ్యం అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు పెరిగినట్లు చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రోటీన్ ప్రధాన ఆహారానికి ప్రాధాన్యత పెరుగుతోందని, తాను కూడా ఉదయాన్నే కేవలం ఆమ్లెట్ తీసుకుంటానని తెలిపారు. గుడ్లు, చేపలు, చికెన్ వంటి ఆహారాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇక సమతుల ఆహారం కోసం మిల్లెట్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో హార్టికల్చర్‌ను ప్రోత్సహించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మార్పులతో ఆరోగ్యవంతమైన సమాజం రూపుదిద్దుకుంటుందన్నారు.
ప్రస్తుత తరం ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తినే తిండి ఎంపికలో జాగ్రత్తలు అవసరమని చంద్రబాబు పిలుపునిచ్చారు.