
‘ది కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ సినిమా చనిపోవడం లేదని, అది “హత్య”కు గురవుతోందని, ఈ హత్యకు పరిశ్రమలోని పోకడలే కారణమని ఆయన ఆరోపించారు.
ఆయన పోస్ట్ ప్రకారం, సినిమాను చంపేస్తున్నది స్టార్ల భారీ జీతాలు, పీఆర్ స్టంట్లు, ఎయిర్‌పోర్ట్ లుక్స్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, నకిలీ బాక్సాఫీస్ నంబర్లే. ఈ హడావుడిలో అసలైన ‘సినిమా’ మరుగున పడిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ముప్పుపై బాలీవుడ్ మౌనంగా ఉండటాన్ని ఆయన తప్పుబట్టారు. “హాలీవుడ్ రచయితలు తమ ఊహను కాపాడుకోవడానికి 148 రోజులు సమ్మె చేశారు. కానీ బాలీవుడ్‌లో కనీసం చర్చ, ఆగ్రహం కూడా లేవు” అని విమర్శించారు.
స్టూడియోలు ఇప్పటికే ఏఐతో రామాయణ, మహాభారతాలను పరీక్షిస్తుంటే, బాలీవుడ్ తారలు మాత్రం పెయిడ్ అవార్డు షోలలో డ్యాన్సులు చేయడంలో బిజీగా ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు.
“సినిమా మనుగడ సాగిస్తుందా? కాదు.. అసలు ప్రశ్న, మనం ఇంకా కలలు కనడం గుర్తుందా? మన కలల కోసం ఎలా పోరాడాలి?” అంటూ ఆయన ప్రశ్నించారు. కాగా, వివేక్ చివరి చిత్రం ‘ది బెంగాల్ ఫైల్స్’ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.
