
న్యూస్ డెస్క్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తొలి విడత (121 సీట్లు) పోలింగ్ భారీగా నమోదు కావడం, ఇది ప్రభుత్వ వ్యతిరేకతో, అనుకూలతనో తేల్చుకోలేక ప్రధాన కూటములు తలలు పట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో ‘హంగ్’ అసెంబ్లీ ఏర్పడుతుందనే విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. నవంబర్ 11న జరగనున్న తుది విడత (122 సీట్లు) పోలింగే బీహార్ భవిష్యత్తును నిర్ణయించనుంది.
ఒకవేళ ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ రాకపోతే, అధికారం ఎవరికి దక్కాలనేది చిన్న పార్టీల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు బీహార్ రాజకీయాలకు ఇద్దరు వ్యక్తులు కింగ్‌మేకర్లుగా మారడం ఖాయం. ఒకరు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాగా, మరొకరు మాజీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (జన్ సురాజ్). ఎన్డీఏ (బీజేపీ, జేడీయూ), మహాఘట్‌బంధన్ (ఆర్జేడీ, కాంగ్రెస్) కూటముల భవిష్యత్తు వీరి నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది.
ఎంఐఎం అధినేత ఒవైసీ ఈసారి బీహార్‌లో తమ సీట్ల సంఖ్య పెరుగుతుందని ధీమాగా ఉన్నారు. హంగ్ ఏర్పడితే ఏం చేస్తారని ప్రశ్నించగా, ఆయన తన వ్యూహాలను బయటపెట్టలేదు. ఎన్నికల ఫలితాల (నవంబర్ 14) తర్వాతే తమ మద్దతు ఎవరికి అనేది నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. తమను బీజేపీకి ‘బీ-టీమ్’ అనడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బీజేపీని నిలువరించలేనివారే తమపై విమర్శలు చేస్తున్నారని పరోక్షంగా కాంగ్రెస్‌పై మండిపడ్డారు.
మరోవైపు, ప్రశాంత్ కిషోర్ ‘జన్ సురాజ్’ పార్టీకి పట్టణ ప్రాంతాల్లో కొంత మద్దతు కనిపిస్తోంది. ఎన్ని సీట్లు గెలుస్తారనే అంచనా లేకపోయినా, ఓట్ల చీలిక ద్వారా, కొన్ని సీట్లు గెలిచినా.. హంగ్ వస్తే ప్రశాంత్ కిషోర్ పాత్ర కీలకంగా మారుతుంది. ఎన్నికల వ్యూహాల్లో దిట్ట అయిన పీకే, ఫలితాల తర్వాత ఎలాంటి ఎత్తుగడ వేస్తారనేది అత్యంత ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం అందరి దృష్టీ నవంబర్ 11న జరిగే రెండో విడత పోలింగ్‌పైనే ఉంది. మైనారిటీ, యాదవ ఓట్లు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలోనే అసలైన సమరం జరగనుంది. తొలి విడత అధిక పోలింగ్‌తో ఇప్పటికే టెన్షన్‌లో ఉన్న ప్రధాన కూటములు, తుది ప్రచారంలో సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. అయితే, హంగ్ ఏర్పడితే మాత్రం బీహార్‌లో అసలైన రాజకీయ చదరంగం ఫలితాల తర్వాతే మొదలవుతుంది.
