
న్యూస్ డెస్క్: కొల్లాపూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. గత పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిచేయలేదని, కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన పనుల్ని కూడా పూర్తి చేయలేకపోయారన్నారు.
భట్టి మాట్లాడుతూ, “కృష్ణా నదిపై బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదు? పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ప్రాజెక్టును ఎందుకు నిలిపేశారు?” అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రాజెక్టులు త్వరగా పూర్తవుతాయన్నారు.
బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణ అభివృద్ధికి అవసరమని, దానిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం అనుచితం అని స్పష్టం చేశారు. “దిల్లీలో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ పోరాటం వల్లే కేంద్రం ఆ ప్రాజెక్టుపై ఆగిపోయింది” అని తెలిపారు.
ఏపీ మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన భట్టి, “తెలంగాణకు ద్రోహం చేసిన బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నాలు ఆపాలి. పోలవరం కట్టినా ముంపు లేకుండా నిర్మించాలి” అని సూచించారు.
ముంపు గ్రామాల ప్రజల హక్కులకు తమ ప్రభుత్వం పోరాడుతుందని భట్టి చెప్పారు. ప్రజల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
