
న్యూస్ డెస్క్: వివాహ బంధానికి వెలుపల సంబంధాలు పెట్టుకోవడం ఇటీవల కాలంలో ఆందోళనకరంగా పెరుగుతోందని, దీనివల్ల కుటుంబాల్లో కలహాలు, విడాకులు ఎక్కువవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్న వేళ, ఓ సంచలన సర్వే ఫలితాలు వెలువడ్డాయి. వివాహేతర సంబంధాల డేటింగ్ యాప్ ‘గ్లీడెన్’ నిర్వహించిన ఈ అధ్యయనంలో, దేశంలోనే బెంగళూరు నగరం ఈ విషయంలో అగ్రస్థానంలో నిలవడం గమనార్హం.
గ్లీడెన్ సర్వే ప్రకారం, బెంగళూరు తర్వాత ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, పుణె నగరాలు వరుసగా నిలిచాయి. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఈ వివాహేతర సంబంధాలు ఎక్కువగా ఐటీ, వైద్య రంగాల్లో పనిచేస్తున్న వారిలోనే కనిపిస్తున్నాయి. పని ఒత్తిడి, మారుతున్న జీవనశైలి, భావోద్వేగ అసంతృప్తి వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఈ సర్వే కోసం గ్లీడెన్ 12 నగరాల్లో 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న 1,510 మందిని ప్రశ్నించింది. బెంగళూరులో సర్వే చేసిన వారిలో 53 శాతం మంది ఏదో ఒక రకమైన అవిశ్వాసానికి (శారీరక, భావోద్వేగ లేదా రెండూ) పాల్పడినట్లు అంగీకరించారు. 29 శాతం మంది సోషల్ మీడియాలో సరసాలాడినట్లు తెలిపారు. గ్లీడెన్ యాప్ మొత్తం వినియోగదారులలో 17 శాతం మంది బెంగళూరు నుంచే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఈ యాప్ యూజర్లలో 65 శాతం మంది పురుషులు కాగా, 35 శాతం మంది మహిళలు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది 30 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు వారే కావడం గమనార్హం. భాగస్వామి తగినంత సమయం కేటాయించకపోవడం, అవసరాలను గుర్తించకపోవడం, సాన్నిహిత్యం లోపించడం వంటివి తమను వివాహేతర సంబంధాల వైపు నెట్టాయని చాలా మంది పేర్కొన్నారు.
గత ఐదేళ్లలో వ్యభిచారం (అడల్టరీ) కేసులు 40 శాతం పెరిగాయని ‘దుర్గా ఇండియా’ వ్యవస్థాపకురాలు ప్రియా వర్ధరాజన్ తెలిపారు. అలాగే, వివాహేతర సంబంధాల కారణంగా విడాకుల కేసులు 25-30 శాతం పెరిగాయని న్యాయవాది కుసుమ్ రంగనాథన్ పేర్కొన్నారు. ఈ సమస్య కేవలం పురుషులకే పరిమితం కాలేదని, స్త్రీలు కూడా ఇలాంటి సంబంధాల్లో ఉంటున్నారని ఆమె తెలిపారు.
టెక్నాలజీ పెరగడం వల్ల ఒకవైపు మోసం చేయడం సులభతరం అయితే, మరోవైపు అది బయటపడటానికీ అదే టెక్నాలజీ కారణమవుతోంది. ఏది ఏమైనా, మారుతున్న సామాజిక విలువలు, వ్యక్తిగత సంబంధాలపై ఈ సర్వే ఫలితాలు తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
