
న్యూస్ డెస్క్: బనకచర్ల ప్రాజెక్టు గురించి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ ప్రాజెక్టును కట్టి తీరుతామని ధైర్యంగా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు.
లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు స్పందించదని ఆయన ప్రశ్నించారు.
హరీశ్ రావు మాట్లాడుతూ, బనకచర్లపై ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ మంత్రి సహా కాంగ్రెస్ నాయకులు ఎవ్వరూ మాట్లాడటం లేదని ఆరోపించారు.
లోపాయికారిగా ఒప్పందం చేసి మౌనంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిన సంగతి, ఢిల్లీలో జరిగిన సమావేశాలను గుర్తు చేశారు.
ఇక, లోకేశ్ ధైర్యం చూస్తే బనకచర్ల కట్టి తీరుతామని చెబుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదని హరీశ్ రావు నిలదీశారు. లోకేశ్ మాటలపై రేవంత్ రెడ్డి కూడా స్పందించడం లేదని విమర్శించారు.
రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించే పనిలో ఉన్నారని, తన పదవిని కాపాడుకోవాలనే ఆలోచనతో వ్యవహరిస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. బనకచర్ల ప్రాజెక్టుపై అన్ని పార్టీల నేతలు స్పష్టంగా స్పందించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
