
కోలీవుడ్‌లో అవకాశాలు తగ్గినా, లేడీ సూపర్ స్టార్ నయనతారకు టాలీవుడ్‌లో మాత్రం క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ‘సైరా’, ‘గాడ్ ఫాదర్’ తర్వాత, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంలోని “మీసాల పిల్ల” పాటతో ఆమె మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. ఈ సినిమాపై పాజిటివ్ బజ్ నడుస్తుండగానే, నయన్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలిం నగర్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
‘వీరసింహారెడ్డి’తో బ్లాక్‌బస్టర్ కొట్టిన నటసింహం బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో హీరోయిన్‌గా నయనతారను ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. నవంబర్ 7న పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించి, డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారట.
అప్పటికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ షూటింగ్ దాదాపు పూర్తవుతుంది కాబట్టి, నయనతార డేట్ల విషయంలో ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. బాలకృష్ణ, నయనతారలది టాలీవుడ్‌లో సూపర్ హిట్ కాంబినేషన్. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’, ‘జై సింహా’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు నాలుగోసారి ఈ జోడీ తెరపైకి రానుండటం అభిమానులకు పండగే.
ఈ సినిమా కథాంశం గురించి పూర్తి వివరాలు తెలియకపోయినా, ఇది రాజవంశాల నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామా అని, గోపీచంద్ మలినేని ఓ పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని తెలుస్తోంది. బాలకృష్ణను ఫ్యాక్షన్ టచ్ లేకుండా, సరికొత్తగా ప్రజెంట్ చేయనున్నారట. బడ్జెట్ ఎక్కువగా ఉండటంతో, ఓటీటీ పార్ట్‌నర్‌ను ఫైనల్ చేయడంలో ఆలస్యం వల్లే ప్రాజెక్ట్ ప్రారంభం కాస్త ఆలస్యమైందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
నయనతార ఎంపికపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని టీమ్ ప్రీ-ప్రొడక్షన్, కాస్టింగ్ పనుల్లో బిజీగా ఉంది. ఈ పవర్ఫుల్ కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు.
