
పదేళ్ల తర్వాత ‘బాహుబలి‘ బ్రాండ్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమైంది. ‘ది ఎపిక్’ పేరుతో రానున్న ఈ రీ రిలీజ్, కేవలం పాత జ్ఞాపకంలా కాకుండా, ఒక కొత్త సినిమా రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక లిస్ట్ ప్రకారం, ఈ రీ రిలీజ్ హక్కులు ఏకంగా రూ. 36.5 కోట్లు పలికినట్లు సమాచారం. ఇందులో నైజాం రూ. 17 కోట్లు, ఆంధ్రా రూ. 15 కోట్లు కాగా, సీడెడ్ హక్కులు రూ. 4.5 కోట్లకు అమ్ముడయ్యాయని ప్రచారం జరుగుతోంది.
ఈ అంకెల్లో నిజమెంత అనేది పక్కన పెడితే, ఒక రీ రిలీజ్ సినిమాకు ఈ స్థాయి బిజినెస్ జరగడం భారతీయ సినిమా చరిత్రలోనే ప్రథమం. ఇది ప్రస్తుతం ఓ స్టార్‌డమ్ ఉన్న టైర్-2 హీరో కొత్త సినిమా థియేట్రికల్ బిజినెస్‌కు ఏమాత్రం తీసిపోని నంబర్.
అయితే, ఇది కేవలం పాత సినిమాను మళ్లీ వేయడం కాదు. ‘బాహుబలి’ రెండు భాగాలను కలిపి, కొన్ని కొత్తగా చిత్రీకరించిన సన్నివేశాలను జోడించి విడుదల చేస్తుండటమే ఈ క్రేజ్‌కు అసలు కారణం. ఇది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని డిస్ట్రిబ్యూటర్ల నమ్మకం.
అంతేకాకుండా, ‘RRR’ తర్వాత దర్శకుడు రాజమౌళికి, ప్రభాస్‌కు అంతర్జాతీయంగా పెరిగిన బ్రాండ్ ఇమేజ్ కూడా ఈ భారీ రేట్లకు కారణమవుతోంది. ఈ కాంబోపై ఉన్న నమ్మకమే పెట్టుబడిగా మారుతోంది.
