
న్యూస్ డెస్క్: ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు స్టార్ లెగ్ స్పిన్నర్ అమండా వెల్లింగ్టన్ త్వరలో “ఇండియా కోడలు” కాబోతున్నారు. పంజాబ్‌కు చెందిన తన ప్రియుడు హంరాజ్‌తో ఆమె వివాహం నిశ్చయమైంది. కొద్ది రోజుల క్రితం వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ శుభవార్తను అమండా సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
వీరిద్దరి పరిచయం ఆస్ట్రేలియాలో జరిగిన ఓ సంగీత కచేరీలో జరగడం విశేషం. ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్జిత్ దోసాంజ్‌కు జెర్సీని బహుమతిగా ఇవ్వడానికి వెళ్లిన అమండా, అక్కడే హంరాజ్‌ను కలిశారు. ఆ పరిచయం ప్రేమగా మారి, ఇప్పుడు పెళ్లి బంధానికి దారితీసింది.
అయితే, ఈ వార్త కంటే పెద్ద సంచలనం మరొకటి ఉంది. వివాహం తర్వాత తనకు భారత పౌరసత్వం లభిస్తే, టీమిండియా తరఫున క్రికెట్ ఆడాలని ఆశపడుతున్నట్లు అమండా తన మనసులోని మాట బయటపెట్టారు.
లెగ్ స్పిన్‌తో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టడంలో అమండా దిట్ట. ప్రస్తుతం ఆమెకు ఆస్ట్రేలియా జాతీయ జట్టులో అవకాశాలు తగ్గినా, విమెన్స్ బిగ్ బాష్ లీగ్ (WBBL)లో అడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున నిలకడగా రాణిస్తోంది.
ఆమె కోరిక నిజమై, భవిష్యత్తులో అమండా టీమిండియా జెర్సీ ధరిస్తే, అది భారత మహిళల క్రికెట్‌కు మరింత బలం చేకూర్చినట్లవుతుంది. ఈ వార్త ప్రస్తుతం ఇరు దేశాల క్రికెట్ అభిమానుల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
