
న్యూస్ డెస్క్: సెప్టెంబర్ 28న ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసి భారత్ గెలిచినా, ఆ ట్రోఫీ ఇంకా మన దేశానికి చేరలేదు. పెహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా, ఏసీసీ చైర్మన్, పీసీబీ చీఫ్ మొహిసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకునేందుకు టీమిండియా నిరాకరించడమే ఈ వివాదానికి మూలం.
టీమిండియా షాక్‌తో అవమానంగా భావించిన నఖ్వీ, కప్‌ను తనతో పాటే తీసుకెళ్లాడు. మొదట ఏసీసీ కార్యాలయానికి తరలించినా, ప్రస్తుతం ఆ ట్రోఫీ అబుదాబిలో ఓ రహస్య ప్రదేశంలో ఉందని సమాచారం.
ట్రోఫీని అప్పగించాలని బీసీసీఐ డిమాండ్ చేయగా, నఖ్వీ ఓ షరతు విధించాడు. భారత కెప్టెన్ స్వయంగా తన చేతుల మీదుగా తీసుకోవాలని పట్టుబట్టగా, బీసీసీఐ ససేమిరా అనడంతో వివాదం ముదిరింది.
దీంతో బీసీసీఐ పది రోజుల క్రితం అల్టిమేటం జారీ చేసింది. నవంబర్ 4న జరిగే ఐసీసీ సమావేశంలో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించింది. ఐసీసీ చైర్మన్‌గా జై షా ఉండటం నఖ్వీకి ఇబ్బందిగా మారింది.
ఐసీసీ ఒత్తిడితో నఖ్వీ దిగొచ్చినట్లు తెలుస్తోంది. తన పదవికే ముప్పు వస్తుందని భయపడిన నఖ్వీ, ట్రోఫీని తిరిగి ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
నేడో, రేపో ఆసియా కప్ ట్రోఫీ ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకుంటుందని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా ధృవీకరించారు. దీంతో నెల రోజుల నాటి ఈ వింత వివాదానికి తెరపడినట్లయింది.
