
న్యూస్ డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో పోటీ రోజు రోజుకూ ముదురుతున్న వేళ టెక్ దిగ్గజం యాపిల్ కీలక నాయకత్వ మార్పు చేపట్టింది. యాపిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైస్ ప్రెసిడెంట్ గా అమర్ సుబ్రమణ్య అనే భారతీయుడిని నియమించింది.
ప్రస్తుతం ఏఐ చీఫ్‌గా ఉన్న జాన్ జియానాండ్రియా వచ్చే ఏడాది జనవరిలో పదవీ విరమణ చేయనున్నారు. అప్పటివరకు సుబ్రమణ్య అడ్వైజర్ హోదాలో కొనసాగుతారు. ‘సిరి’లో కీలక ఏఐ అప్ డేట్లను వాయిదా వేసిన నేపథ్యంలో ఈ నాయకత్వ మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది.
భారత్‌కు చెందిన అమర్ సుబ్రమణ్య 2001లో బెంగళూరు యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత విస్కాన్సిన్ యూనివర్సిటీ నుంచి పీహెచ్.డీ పూర్తి చేశారు.
ఆసక్తికర విషయం ఏమిటంటే.. సుబ్రమణ్య 2009లో గూగుల్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించి, ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ వరకు ఎదిగారు. గూగుల్‌లో ఉన్న సమయంలోనే జెమినీ ఏఐ అసిస్టెంట్ అభివృద్ధికి నాయకత్వం వహించారు.
ఈ ఏడాది జూన్ లో ఆయన గూగుల్ ని వదిలి మైక్రోసాఫ్ట్ లో చేరారు. అక్కడ ఏఐ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ గా 5 నెలలు పనిచేసిన తర్వాత ఇప్పుడు యాపిల్ లో కీలక బాధ్యతలు చేపట్టారు.
