
న్యూస్ డెస్క్: రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదించారు. ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్న మార్కాపురం, మదనపల్లె జిల్లాలతోపాటు పరిపాలనా సౌలభ్యం కోసం రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు.
మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఈ మార్పులకు ఓకే చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 26 నుంచి 29కి పెరుగుతుంది. కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులకు సూచించారు.
ఈ మూడు జిల్లాలతోపాటు కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటుకు సీఎం అంగీకారం తెలిపారు. నక్కపల్లి (అనకాపల్లి), అద్దంకి (ప్రకాశం), పీలేరు (మదనపల్లి), బనగానపల్లె (నంద్యాల), మడకశిర (శ్రీసత్యసాయి) కేంద్రాలుగా ఈ డివిజన్లు రానున్నాయి.
కొత్తగా ఏర్పడే మూడు జిల్లాలు వాటి జనాభా:
- పోలవరం జిల్లా: రంపచోడవరం కేంద్రంగా రంపచోడవరం చింతూరు రెవెన్యూ డివిజన్లతో 3.49 లక్షల జనాభాతో ఏర్పాటు.
- మార్కాపురం జిల్లా: యర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాలతో 11.42 లక్షల జనాభాతో ఏర్పాటు.
- మదనపల్లి జిల్లా: మదనపల్లి, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాలతో 11.05 లక్షల జనాభాతో ఏర్పాటు.
అలాగే, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలలో పలు మండలాలను మార్పు చేర్పులు చేయనున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని విభజించి కొత్తగా పెద్దహరివనం మండలాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు.
మొత్తం 17 జిల్లాల్లో మార్పులు చోటు చేసుకుంటుండగా, మిగతా 9 జిల్లాలలో (విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, అనంతపురం) ఎలాంటి మార్పులు జరగడం లేదు.
