
న్యూస్ డెస్క్: భారత మహిళల జట్టు తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన తెలుగమ్మాయి శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఆమెకు రూ. 2.5 కోట్ల నగదు బహుమతితో పాటు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. టోర్నీ తర్వాత తొలిసారి సొంత రాష్ట్రానికి వచ్చిన ఆమెకు ఘన స్వాగతం లభించింది.
గురువారం గన్నవరం విమానాశ్రయంలో శ్రీచరణికి మంత్రులు, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) అధ్యక్షుడు కేశినేని చిన్ని, ఎంపీ సాన సతీశ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్‌పోర్ట్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
ఆ తర్వాత, శ్రీచరణి మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లను వారి నివాసంలో కలిశారు. శ్రీచరణి ప్రతిభను సీఎం కొనియాడి, దేశానికి గర్వకారణంగా నిలిచారని అభినందించారు.
విన్నింగ్ స్పిన్నర్‌తో సెల్ఫీ దిగిన చంద్రబాబు ఆ ఫోటోను ‘X’లో పోస్ట్ చేశారు. “స్టార్ క్రికెటర్ శ్రీచరణిని ఆహ్వానించడం గౌరవంగా ఉంది, ఆమె విజయం మహిళలకు స్ఫూర్తి” అని లోకేష్ కూడా ‘X’లో పేర్కొన్నారు.
కడప జిల్లాకు చెందిన శ్రీచరణి, ఈ ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసింది. టోర్నీలో దీప్తి శర్మ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా నిలిచింది. ఫైనల్‌లో కీలక వికెట్ పడగొట్టి జట్టు గెలుపులో ముఖ్య పాత్ర పోషించింది.
