
న్యూస్ డెస్క్; అమరావతికి ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) ప్రాజెక్టు కీలక దశలోకి చేరింది. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ రోడ్డు వెడల్పును 70 మీటర్ల నుంచి 140 మీటర్లకు పెంచిన తరువాత భూసేకరణపై అధికారులు దృష్టి సారించారు.
ఎన్‌హెచ్ఏఐ ప్రాథమిక అంచనాల ప్రకారం, భూసేకరణకు రూ.5,000 కోట్లు, అటవీ భూములకు రూ.300 కోట్లు అవసరం కానుంది. ఈ రహదారి మొత్తం 189 కిలోమీటర్ల పొడవులో ఐదు జిల్లాలను కలుపుతుంది. దానికి అవసరమైన భూమి దాదాపు 3,400 హెక్టార్లు ఉండనుంది.
ప్రాజెక్టును 8 నుంచి 10 ప్యాకేజీలుగా విభజించనున్నారు. అమరావతికి సమీపంగా రెండు వంతెనలను కూడా నిర్మించనున్నారు. వీటిని వేర్వేరు పనులుగా చేపట్టే యోచన ఉంది.
ఈ ఓఆర్‌ఆర్ ద్వారా ఆరు ప్రధాన జాతీయ రహదారులు అనుసంధానమవుతాయి. తాజా డిజైన్ ప్రకారం మున్నలూరు, వల్లభాపురం వద్ద వంతెనలు నిర్మించి ట్రాఫిక్‌ను సమర్థవంతంగా మళ్లించనున్నారు.
ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదికను త్వరలో కేంద్రానికి పంపనున్నారు. ఆమోదాల అనంతరం భూసేకరణ అధికారికంగా ప్రారంభమవుతుంది. ఈ ప్రాజెక్టు అమరావతి అభివృద్ధికి దోహదం చేయనుంది.