
న్యూస్ డెస్క్: అల్లు ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. అల్లు అరవింద్ మూడో కుమారుడు అల్లు శిరీష్, నైనికల నిశ్చితార్థం శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. దీపావళి నుంచే వీరి పెళ్లి వార్తలు వినిపిస్తుండగా, నిశ్చితార్థంతో అధికారికం చేశారు.
ఈ వేడుకకు మెగా, అల్లు కుటుంబాలు మొత్తం హాజరయ్యాయి. అయితే, అందరి దృష్టినీ ఆకర్షించింది మాత్రం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇద్దరూ కలిసి ఈ వేడుకలో సందడి చేశారు.
చాలా కాలంగా ఈ ఇద్దరు టాప్ హీరోల మధ్య దూరం పెరిగిందని, మాటలు లేవని ప్రచారం జరిగింది. కానీ, ఈ నిశ్చితార్థంలో చరణ్, బన్నీ ఎంతో అన్యోన్యంగా కనిపించి, ఆ రూమర్లన్నింటికీ ఒక్క ఫోటోతో ఫుల్‌స్టాప్ పెట్టారు.
మరో ప్రత్యేక ఆకర్షణగా మెగాస్టార్ చిరంజీవి నిలిచారు. ఆయన నేరుగా షూటింగ్ స్పాట్ నుంచి జీన్స్, డెనిమ్ షర్ట్‌లో ఈవెంట్‌కు హాజరయ్యారు. ఆయన స్టైలిష్, యంగ్ లుక్ అందరినీ ఆకట్టుకుంది.
రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి హాజరయ్యారు. చిరంజీవి సతీమణి సురేఖ దగ్గరుండి వేడుక పనులు చూసుకోగా, పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కూడా హాజరయ్యారు.
వీరితో పాటు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, వైష్ణవ్ తేజ్.. ఇలా మెగా ఫ్యామిలీ మొత్తం ఈ నిశ్చితార్థ వేడుకలో సందడి చేసింది. ఇది ఫ్యాన్స్‌కు కన్నుల పండుగగా మారింది.
