
న్యూస్ డెస్క్: గత కొంతకాలంగా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న ప్రముఖ హాస్యనటుడు అలీ పేరు మరోసారి పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఆయన ఏ పార్టీతో సంబంధం లేదని ప్రకటించినా, తాజాగా ఓ ఫోటో కొత్త చర్చకు దారితీసింది.
ఆయన వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కలవడమే ఈ ఊహాగానాలకు కారణమైంది. వంశీని అలీ శాలువాతో సత్కరిస్తున్న ఈ ఫోటోను వైసీపీ వర్గాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి.
దీంతో, అలీ తిరిగి ‘ఫ్యాన్’ గూటికి చేరబోతున్నారా? ఆయన రాజకీయ రీ-ఎంట్రీకి రంగం సిద్ధమైందా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన అలీ, పార్టీ కోసం ప్రచారం చేశారు.
అయితే, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయన ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ పదవి ఆశించినా, కేవలం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2024లోనూ ప్రచారం చేసినా, పార్టీ ఘోర పరాజయం పాలైంది.
అనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించిన అలీ, ఇప్పుడు వంశీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది రాజకీయ భేటీనా లేక కేవలం మర్యాదపూర్వక కలయికా అనేదానిపై స్పష్టత లేదు.
సినిమా పరిశ్రమతో వంశీకి మంచి సంబంధాలు ఉన్నాయని, అందుకే ఇది వ్యక్తిగత సమావేశం మాత్రమేనని కొందరు కొట్టిపారేస్తున్నారు. ఏది ఏమైనా, ఈ భేటీ వెనుక అసలు ఉద్దేశం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
