
న్యూస్ డెస్క్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు తన పార్టీ జీవితం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఇటీవల గోవా గవర్నర్‌గా నియమితులైన ఆయన, టీడీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పొలిట్ బ్యూరో పదవికి రాజీనామా చేశారు.
ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో తొలినుంచి కీలక భూమిక పోషించిన అశోక్ గజపతిరాజు, తన రాజకీయ ప్రయాణానికి అవకాశం కల్పించినందుకు పార్టీకి, చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. “ఇన్నాళ్ల సేవకి ఇది నా విరామం” అంటూ ఆయన పేర్కొన్నారు.
ఆయన పంపిన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పంపారు. త్వరలో గోవా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిపారు.
అశోక్ గజపతిరాజు ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఒక్కసారి ఎంపీగా గెలిచి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా కూడా సేవలందించారు.
తన కుమార్తె అదితి గజపతిరాజు 2024లో విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా గెలవడం ఆయన కుటుంబానికి మళ్ళీ రాజకీయ పదవిని తెచ్చింది. ఇప్పుడు ఆయన గవర్నర్‌గా కొత్త జర్నీ మొదలవుతోంది.