
న్యూస్ డెస్క్: వైద్య విజ్ఞానం రోజు రోజుకీ అద్భుతాలను ఆవిష్కరిస్తోంది. అమెరికాలో ఓహియో రాష్ట్రంలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఫ్రీజ్ చేసిన పిండం నుంచి ఒక ఆరోగ్యవంతమైన శిశువు జన్మించడం విశేషం.
లిండ్సే, టిమ్ పియర్స్ అనే దంపతులు పిల్లల కోసం నిరీక్షణలో ఉన్న సమయంలో, ‘స్నోఫ్లేక్స్’ అనే పిండ దత్తత కార్యక్రమంలో చేరారు. 1994లో లిండా అనే మహిళ ఐవీఎఫ్ ద్వారా పిండాలను సృష్టించి వాటిని ఫ్రీజ్ చేశారు. వీటిలో మూడు పిండాలను భద్రంగా ఉంచారు.
లిండా మెనోపాజ్ దశకు చేరుకున్న తర్వాత తన పిండాలను దానం చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో పియర్స్ దంపతులు వాటిని దత్తత తీసుకున్నారు. నిపుణుల పర్యవేక్షణలో ఒక్క పిండాన్ని లిండ్సే గర్భంలో ప్రవేశపెట్టగా, ‘థియో’ అనే శిశువు జన్మించాడు.
ఈ ప్రక్రియకు టెన్నస్సీలోని ఐవీఎఫ్ క్లినిక్ ఆధ్వర్యం వహించింది. పాత సాంకేతికతతో ఫ్రీజ్ చేసినా, పిండం విజయవంతంగా జీవం పొందింది. ఇది వైద్య రంగంలో ఓ మైలురాయిగా నిలిచింది.
థియోకు బయోలాజికల్‌గా 30 ఏళ్ల వయసున్న సోదరి ఉంది. ఒక్కసారి ఏర్పడిన పిండాల నుంచి మూడు దశాబ్దాల వ్యత్యాసంలో అన్నాచెల్లెళ్లు జన్మించడం అరుదైన ఘట్టంగా చరిత్రకెక్కింది.
