
న్యూస్ డెస్క్: రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోందని, కనీస అవసరాలకు కూడా నిధులు సర్దుబాటు చేయడం కష్టంగా ఉందని మంత్రులే అంతర్గత సంభాషణల్లో వాపోతున్న ప్రస్తుత తరుణంలో, ప్రభుత్వ సొమ్మును అత్యంత జాగ్రత్తగా ఖర్చు చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. కానీ, అధికారుల అత్యుత్సాహం, ప్రణాళికా లోపం కారణంగా ప్రజాధనం వృధా అవ్వడమే కాకుండా, చేపట్టిన లక్ష్యం కూడా నెరవేరని పరిస్థితి తెలంగాణలో నెలకొంది. ఇప్పుడు ఇదే అంశం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు ప్రధాన అస్త్రంగా మారింది.
తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పండుగను గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలను ఆకట్టుకునేందుకు ఓ అవకాశంగా మలుచుకుంది. ఆ పండుగ సందర్భంగా ఏటా మహిళలకు చీరలను ఉచితంగా పంపిణీ చేసింది. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ఏడాది బతుకమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రెండు దశల్లో ఏకంగా రూ. 100 కోట్లు వెచ్చించి చీరలను కొనుగోలు చేసింది.
ఈ చీరలు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలకు చేరుకుని, గోడౌన్లలో భద్రపరిచారు కూడా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించి, ఆ తర్వాత జిల్లాల్లో మంత్రులు పంపిణీ చేయాలని భావించారు. అయితే, హైదరాబాద్‌లో తొలుత 5 లక్షల చీరలు మాత్రమే అంచనా వేయగా, లబ్ధిదారుల సంఖ్య 12 లక్షలకు పెరగడంతో, మిగిలిన చీరలు తెప్పించే వరకు పంపిణీని వాయిదా వేశారు.
ఈలోపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల షెడ్యూల్ రావడంతో, ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమల్లోకి వచ్చింది. దీంతో చీరల పంపిణీ కార్యక్రమం పూర్తిగా నిలిచిపోయింది. బతుకమ్మ పండుగ గడిచిపోయింది, ఆ తర్వాత వచ్చిన దీపావళి కూడా ముగిసింది. అయినా, రూ. 100 కోట్లు పెట్టి కొన్న చీరలు మాత్రం గోడౌన్లకే పరిమితమయ్యాయి.
ఇప్పుడు ఈ చీరలను ఏం చేయాలన్న దానిపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా వీటిని పంపిణీ చేయాలనే ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు బీఆర్ఎస్‌కు రాజకీయంగా కలిసొస్తోంది.
తమ హయాంలో బతుకమ్మ చీరలను సకాలంలో అందించి మహిళలను గౌరవించామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో, అసమర్థతతో వారిని అవమానిస్తోందని బీఆర్ఎస్ నేతలు జూబ్లీహిల్స్ ప్రచారంలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రంలో, రూ. 100 కోట్లు వృధా చేశారంటూ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు.
