
హైకోర్టు తీర్పుతో వైసీపీకి మరో దెబ్బ – రీపోలింగ్ పై ఈసీకి పూర్తి అధికారం
న్యూస్ డెస్క్: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల ఫలితాలపై రాజకీయ వాతావరణం ఇంకా ఉత్కంఠ భరితంగానే ఉంది. ఈ రెండు నియోజకవర్గాల్లో రీపోలింగ్ జరపాలని వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే, ఆ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది.
వైసీపీ వాదన ప్రకారం, ఉపఎన్నికల్లో టిడిపి భారీ స్థాయిలో అవకతవకలకు పాల్పడిందని, పులివెందులలో 15 పోలింగ్ బూత్‌లు, ఒంటిమిట్టలో 30 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసింది. లేకపోతే, ఎన్నికల ఫలితాలపై స్టే విధించాలంటూ హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది.
కానీ, హైకోర్టు ఈ పిటిషన్‌ను పరిశీలించిన అనంతరం, ఎన్నికల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. రీపోలింగ్ విషయంలో తుది నిర్ణయం తీసుకునే అధికారం ఎన్నికల కమిషన్‌కే ఉందని హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో వైసీపీకి మరో షాక్ తగిలినట్లైంది.
ఇక పిటిషన్‌పై విచారణ జరుగుతున్న సమయంలోనే పులివెందుల జెడ్పీటీసీ ఫలితాలు బయటపడ్డాయి. రెండు బూత్‌లలో రీపోలింగ్ ఇప్పటికే పూర్తయిందని, దాని ఫలితాల ప్రకారం టిడిపి విజయం సాధించింది.
రాజకీయ విశ్లేషకుల ప్రకారం, ఈ తీర్పు వైసీపీకి గట్టి దెబ్బగా మారే అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్‌పై నమ్మకం ఉంచకుండా కోర్టు మార్గం ఎంచుకోవడం పార్టీకి ప్రతికూల ప్రభావం చూపవచ్చని అంటున్నారు.
మొత్తానికి, పులివెందుల, ఒంటిమిట్ట ఉపఎన్నికల ఫలితాలు, రీపోలింగ్ వివాదం, హైకోర్టు తీర్పు— ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కొత్త చర్చలకు దారి తీస్తున్నాయి.
