
ఢిల్లీ: ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగిన తర్వాత రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. దాడి నేపథ్యంలో కేంద్రం తక్షణమే స్పందించి, ఆమెకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలనే నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయగా, ఉదయం నుంచే సీఆర్పీఎఫ్ బలగాలు సీఎం నివాసానికి చేరుకున్నాయి.
సాధారణంగా జెడ్ కేటగిరీ భద్రతలో 20 మందికి పైగా సిబ్బంది ఉంటారు. వీరిలో ప్రత్యేక శిక్షణ పొందిన గార్డులు, డ్రైవర్లు, ఎస్కార్ట్ వాహనాలు ఉంటాయి. ఈ సదుపాయాలన్నీ ఇప్పుడు రేఖా గుప్తాకు కేటాయించబడ్డాయి.
సీఎం నివాసం, క్యాంపు కార్యాలయం, పబ్లిక్ మీటింగ్ వేదికల వద్ద భద్రతను పెంచి, రౌండ్ ది క్లాక్ సెక్యూరిటీ అందిస్తున్నారు.
బుధవారం ఉదయం రేఖా గుప్తా ప్రజల ఫిర్యాదులు స్వీకరిస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఆమెపై దాడి చేయడం షాకింగ్‌గా మారింది. సమస్య చెప్పుకోవడానికి వచ్చినట్లు నటించిన ఆ వ్యక్తి, ఆకస్మికంగా సీఎం చెంపపై కొట్టాడు. వెంటనే స్పందించిన సెక్యూరిటీ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు.
దాడి తర్వాత రేఖా గుప్తాను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ఎలాంటి పెద్ద గాయాలు కాలేదని వైద్యులు స్పష్టంచేశారు. అయితే ఈ ఘటన ఆమె భద్రతా ప్రమాణాలపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది.
