
ఆంధ్రప్రదేశ్: ఆరోగ్య రంగం అభివృద్ధి దిశగా పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఒక అంశంలో రాష్ట్రం దేశంలో నెంబర్ వన్‌గా నిలవడం ముఖ్యమంత్రి చంద్రబాబును కలవరపరిచింది. అదే సిజేరియన్ కాన్పుల సంఖ్య.
అసెంబ్లీలో జరిగిన ఆరోగ్య చర్చలో సీఎం బాబు మాట్లాడుతూ, ఏపీ వైద్య సదుపాయాలు ప్రపంచ ప్రమాణాల కంటే మెరుగ్గా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో 1.15 లక్షల మంది డాక్టర్లు, 70 వేల పైగా నర్సులు పనిచేస్తున్నారని వివరించారు.
అయితే, ఇటీవల కాలంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 10% మాత్రమే సిజేరియన్లు జరుగుతుండగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 90% పైగా సిజేరియన్లు జరుగుతున్నాయని గణాంకాలు వెల్లడించారు. ఇది మహిళల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ముహూర్తాలు పెట్టుకుని, తేదీలు చెప్పి సిజేరియన్లు చేసే పరిస్థితి ఏర్పడిందని బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరం లేకుండా ఆపరేషన్లు చేయడం సరికాదని హెచ్చరించారు.
ఇకపై సాధారణ ప్రసవాలు పెరగేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి, అధికారులు, వైద్యులకు సీఎం సూచించారు. అవసరం ఉన్నప్పుడే సిజేరియన్ చేయాలని స్పష్టంగా ఆదేశించారు.
ప్రైవేట్ ఆసుపత్రులతో చర్చించి, ఆపరేషన్ల సంఖ్యను తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం సంకేతాలు ఇచ్చారు. ఏపీ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ సమస్యను జీరో స్థాయికి తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
