
ఆంధ్రప్రదేశ్: రాజధాని అమరావతి అభివృద్ధి దిశగా ప్రభుత్వం మరో అడుగు వేసింది. ఈసారి మలేషియా పెట్టుబడులకు తలుపులు తెరచింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థల మద్దతు పొందిన ప్రభుత్వం ఇప్పుడు మలేషియా ప్రతినిధులతో చర్చలు జరిపింది.
మలేషియా అధికారిక బృందం మంత్రి నారాయణతో సమావేశమై రూ.6 నుంచి రూ.10 వేల కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ చర్చల్లో మలేషియాలోని పారిశ్రామిక వేత్తలు, ముఖ్యంగా తెలుగు మూలాలు ఉన్న వ్యాపారవేత్తలు పలు ప్రాజెక్టులను ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ముఖ్యంగా విద్య, టూరిజం, ట్రేడ్, రియల్ ఎస్టేట్, సంస్కృతి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారు.
అమరావతిలో మెడికల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి సైబర్ జయ యూనివర్సిటీ ముందుకు వచ్చింది. ఫైవ్ స్టార్ హోటల్స్ ఏర్పాటు చేయడంపై బెర్జయ గ్రూప్ ఆసక్తి చూపింది.
మంత్రి నారాయణ ఇప్పటికే 51 వేల కోట్ల పనుల టెండర్లు పూర్తయ్యాయని, ట్రంక్ రోడ్లు, క్వార్టర్లు, పాలనా భవనాలు నిర్ణీత గడువుల్లో పూర్తవుతాయని తెలిపారు. వర్షాల కారణంగా కొంత ఆటంకం ఉన్నప్పటికీ పనులు వేగవంతం అవుతున్నాయని చెప్పారు.
